8 June, 2026 | 5:29 PM

సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ

08-06-2026 04:12 PM

హైడ్రా వల్ల బీఆర్ఎస్ నేతలకే ఇబ్బంది

అందరూ హైడ్రాను స్వాగిస్తుంటే.. మీకేందుకు బాధ 

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ కూడా తాను హిట్లర్‌ అన్నారని తెలిపిన శ్రీధర్ బాబు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన నాజీ హిట్లర్‌ వేరు.. జన బాహుళ్యంలో వాడే హిట్లర్‌ వేరని సూచించారు. డిసిప్లేన్‌తో వాడే పదాన్ని డిక్టేటర్‌షిప్‌ అని చెప్పడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఏదైనా పని సాధించే వరకు విరమించని వాడినే హిట్లర్(Hitler) అంటారని, ఏ పనినైనా పట్టుదలగా సాధించాలని ముఖ్యమంత్రి (Chief Minister Revanth Reddy) చెప్పారని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. సీఎం ఏదో నాజీ మద్దతు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారుల గుండెల్లో భయం పెట్టిస్తుంటే ఓర్వలేకపోతున్నారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హయాంలో ఆయన దగ్గరికి ఎమ్మెల్యేలను కూడా రానివ్వలేదని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలను గాలికి వదిలేశారని శ్రీధర్ బాబు(Sridhar Babu) ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిచేస్తుంటే నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.

హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోందన్న శ్రీధర్ బాబు రాజ్యాంగం, చట్టం ప్రకారమే హైడ్రా(HYDRAA) నోటీసులు ఇచ్చిందని తెలిపారు. గతంలో భూ కబ్జా జరిగిందంటే పట్టించుకునేవారే లేరన్నారు. హైడ్రా చర్యలను ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. హైడ్రా చర్యల వల్ల బీఆర్ఎస్ నేతలకే ఇబ్బంది కలిగిందన్నారు. అందరూ హైడ్రా చర్యలను స్వాగతిస్తుంటే.. మీకేందుకు బాధ అన్నారు. తప్పుడు పని చేసిన వారిపట్ల హిట్లర్ లా వ్యవహరిస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. కబ్జాదారులు, అవినీతిపరులపై ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటామనిని సీఎం చెప్పారు. తమపై తప్పుడు ప్రచారాలతో హరీశ్ రావు(Harish Rao) ఊరూరు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు మీ మేనిఫెస్టోపై ఒకసారి చర్చిద్దామని మంత్రి శ్రీధర్ బాబు సవాల్ చేశారు.