రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా.. వద్దా? హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మండిపడ్డారు. విమర్శలే ప్రధాన అంశంగా బీఆర్ఎస్ నేతలు ముందుకెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా.. వద్దా? హరీశ్ రావు(Harish Rao) చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక, పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్(Blackmailing Politics) చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జంట నగరాలకు సంబంధించిన మెట్రోను విస్తరణ, శంషాబాద్ కు మెట్రో(Metro to Shamshabad) విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే అడ్డుకుంటున్నారని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలని ప్రజాప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ(Future City) రద్దు చేస్తామని హరీశ్ రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు చురకలంటించారు.






