మంగుగూడలో పీఎం జన్మన్ పథకంపై అవగాహన సదస్సు
జైనూర్,(విజయక్రాంతి): ఆదిమ గిరిజనుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకంలో భాగంగా జనభాగీదారి అభియాన్‌కు శ్రీకారం చుట్టినట్లు కొమురం భీం ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి తెలిపారు.శనివారం జైనూర్ మండలం రాసిమెట్ట పంచాయతీ పరిధిలోని మంగుగూడలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. "పీఎం జన్మన్ పథకం ద్వారా వ్యక్తిగత, సామూహిక అభివృద్ధితో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆదిమ గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని రమాదేవి సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచించారు.కార్యక్రమంలో రాసిమెట్ట సర్పంచ్ ఉయిక చందు, జైనూర్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్‌సీఈఆర్‌పీ ఉయిక శంకర్, ఉపాధ్యాయులు రవీందర్, విజేందర్, ఉత్తమ్, భీంరావ్, సాంబాజీతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






