23 May, 2026 | 5:44 PM

హరీష్ రావు వ్యాఖ్యలు దురదృష్టకరం

23-05-2026 04:52 PM

ఫ్యూచర్ సిటీతో 20 లక్షల మందికి ఉపాధి: టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్

కడ్తాల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ)ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు తన్నీరు హరీష్ రావు పేర్కొనడం దురదృష్టకరమని టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం మైసిగండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగబోయే వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలను దృష్టిలో పెట్టుకునే హరీష్ రావు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమేనని విమర్శించారు.

​గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు పెద్దపీట వేస్తూ, దక్షిణ తెలంగాణను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గతంలో ఫార్మా సిటీ పేరుతో రైతుల నుంచి అతి తక్కువ ధరకే భూములు లాక్కొని, ప్రపంచంలోనే నిషేధించబడిన కాలుష్య కారక కంపెనీలను ఇక్కడ నెలకొల్పి ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూశారన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణహితంగా గ్రీన్ ఫార్మా జోన్, లైఫ్ సైన్స్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జూన్ 2న ఈ ప్రాంతంలో శంకుస్థాపనల జాతర జరగబోతోందని ఆయన తెలిపారు.

30 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఈ ఫ్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీల ఆర్ అండ్ డి కేంద్రాలు, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ భవనం, ఎన్ఐయూఎం (NIUM), సింగరేణి భవనాలతో పాటు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల డేటా సెంటర్ల భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ మరియు ఇతర రంగాలలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ​యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.

దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా, పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు సభ్యులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటికే ఫోర్త్ సిటీలో 500 ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని, ప్రపంచమంతా ఈ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తోందని అన్నారు. ​ముఖ్యమంత్రి చేస్తున్న ఈ మహత్తర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు దుర్మార్గపు విమర్శలు చేస్తున్నాయని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకున్నామే తప్ప, ఎన్నడూ అడ్డుకోలేదని గుర్తుచేశారు.

పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ​ఈ విలేకరుల సమావేశంలో మైసిగండి సర్పంచ్ జాటోవత్ ప్రేమ జవహర్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ హీరా సింగ్ నాయక్, అమర్ సింగ్, కిషన్ నాయక్, తులసీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.