16 August, 2026 | 4:55 PM

'కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి': సోనియా క్షమాపణలు చెప్పాలిందే!

16-08-2026 04:04 PM

కాంగ్రెస్ నేతలకు కాస్తయినా సిగ్గుండాలి: అమిత్ షా

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'వందేమాతరం'(Vande Mataram row) గీతాలాపనను మధ్యలోనే ఆపేందుకు జరిగిన ప్రయత్నంపై కాంగ్రెస్ పార్టీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఆదివారం తీవ్రంగా విమర్శించారు. చిత్తోర్‌గఢ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా, దానిని ఆపమని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిని కోరారని అమిత్ షా ఆరోపించారు. సోనియా గాంధీ( Sonia Gandhi) చేసిన మహాపరాధాన్ని ప్రజలు క్షమించరని అమిత్ షా తెలిపారు. "కాంగ్రెస్ నిర్లజ్జతను చూడండి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 'వందేమాతరం' గీతం ఆలపిస్తుండగా, ఆ గీతం పాడటం ఆపేయాలని సోనియా ఆ పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. మేమంతా టీవీలో అదంతా చూస్తూ ఉండిపోయాం," అని షా అన్నారు. 

"సోనియా జీ, 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. 'వందేమాతరం' గీతాన్ని అసంపూర్ణంగా వదిలేయాలని ఎవరైనా ఎలా ఊహించగలరు? కాంగ్రెస్ వారు సిగ్గుపడాలి," అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు, 'వందేమాతరం' రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయకు క్షమాపణలు చెప్పాలని కూడా షా డిమాండ్ చేశారు. "మీలో ఏమాత్రం సిగ్గు మిగిలి ఉన్నా, మీరు చేతులు జోడించి బంకిం బాబు అమర ఆత్మకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి," అని అమిత్ షా డిమాండ్ చేశారు.