16 August, 2026 | 4:55 PM

రాజ్‌భవన్‌ ‘ఎట్‌ హోమ్‌’కు గుంజపడుగు సర్పంచ్‌

16-08-2026 04:11 PM

మంథని, ఆగస్టు16 (విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా నిర్వహించిన ఎట్‌ హోమ్‌ తేనీటి విందు కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామ సర్పంచ్‌ దండెవేన సంధ్య బానేష్‌ హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించడం తనకు ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని సంధ్య బానేష్‌ తెలిపారు.

సర్పంచ్‌గా గుంజపడుగు గ్రామ అభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. రాజ్‌భవన్‌ ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ సర్పంచ్‌ సంధ్య బానేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.