20 August, 2026 | 3:36 AM

ఎలాంటి ఇబ్బందుల్లేవ్!

20-08-2026 01:34 AM

మాభూమి మాకు దక్కింది 

22/ఎ సమస్యకు ఫాస్ట్ట్రాక్ పరిష్కారం

22 ఏ దరఖాస్తుదారులు 

ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి

అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందర గోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 22/ ఎ అంశంపై  రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హై దరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పా టు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది..? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి.. ? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి.. ? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి.. ? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమి టి.. ? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు అవకా శం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22/ఎభూముల విషయంలో ప్రజలు ఎ లాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 

నా భూమి నాకు దక్కింది

నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొన్నాను. ఆ స్థలాన్ని వి క్రయించేందుకు నార్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్ను సంప్రదించగా, మీ భూమి 22/ఎ లో ఉందని చెప్పారు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. 

 రాకేష్, పోచారం

క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు 

పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పే ర్కొంటూ గత ఏడాది డిసెంబర్లో22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపో యాయి. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకా రం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం.

సునీల్, నారపల్లి సబ్ రిజిస్ట్రార్ 

300 ప్లాట్లకు పూర్తి విముక్తి- 

కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని నెంబ ర్ 80సిలోగల 250 గజాల స్దలాన్ని నెలరోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూకట్‌పల్లి  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ చేయలేదు. తాజాగా ప్రభుత్వ చర్యల కారణంగా  నాకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. 

 చక్రపాణి, కొనుగోలుదారు

సకాల చర్యల వల్ల రిజిస్ట్రేషన్ 

బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్‌లో గల రెయిన్‌బో విస్టాలో ఉన్నప్లాట్ నెంబర్ 804 ను విక్రయించేందుకు కొద్దికాలం క్రితం యజమాని వెంకట విజయ్‌కుమార్ ప్రయత్నించారు. అయితే 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ జరగలేదు. వెంకట విజ య్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ తన మా మ రాజేంద్రప్రసాద్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈ నెల 12న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో బుధవారం రాజేంద్రప్రసాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మా అల్లుడు సేల్ చేద్దామనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే... 22ఎ కింద గవ ర్నమెం ట్ నిషేధం విధించిందని  చెప్పినందున  ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ తర్వాత నా అల్లుడు నా పేరు మీద స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం.  అదృష్టవశాత్తూ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసు కున్నందున  వెంటనే వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయింది. 

 రాజేంద్రప్రసాద్

ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ 

బాలా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని మూసాపేట్లో గల వైష్ణవి ఎస్టేట్ ప్రతినిధి శ్రీనివాస్ మూసాపేట సర్వే నెంబర్ 108లోగల భూమిని విక్రయించేందుకు రాగా 22ఎ నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తిరస్కరించారు. తాజాగా ప్రభుత్వ చర్యలు కారణంగా బుధవారం శ్రీనివాస్ తన భూమికి రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాకు 2005 లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. మేము రిజిస్ట్రేషన్ కి అప్పటినుంచి  ప్రయత్నం  చేస్తున్నా ము. తాజాగా రెండు వారాల క్రితం మూసాపేట్ బాలానగర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కి వెళ్తే 22ఎ లో పెట్టామని చెప్పారు. మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. 

 శ్రీనివాస్