1 May, 2026 | 1:44 AM

సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని ఉపేక్షించం

01-05-2026 12:23 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టీకరణ

మానకొండూరు, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం లో చేపట్టే గృహ నిర్మాణాలతోపాటు ’భూ భారతి’ సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే  రాష్ట్ర రాజధానిలో హిమయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం గురువారం మంత్రి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయించాలని, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలేవైనా ఉంటే సత్వరం పరిష్కరించాలన్నారు. అలాగే భూములకు సంబంధించిన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారాలకు పాటుపడాలన్నారు. ప్రజాప్రతినిధుల వద్దకు లేదా అధికారుల వద్దకు వచ్చే ఈ శాఖలకు సంబంధించిన సమస్యలు సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని ఉపేక్షించబోమని పొంగులేటి స్పష్టం చేశారు.

గత బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన పథకాలతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.