5 August, 2026 | 12:27 PM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన బొగ్గు లారీ

05-08-2026 11:33 AM

డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. పెను ప్రమాదం తృటిలో తప్పింది.

బొగ్గు టిప్పర్లు, కాలుష్యంపై సింగరేణి యాజమాన్యం స్పందించాలని గ్రామస్థుల డిమాండ్.

కిష్టారం ఆగస్టు 5 (విజయక్రాంతి):  కొత్తగూడెం నుంచి బొగ్గు అన్‌లోడ్ చేసి వస్తున్న టీఎస్ 20 టీ 2226 నంబర్ గల కోల్ ట్రక్ లారీ(Coal truck/lorry) సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం మెయిన్ సెంటర్‌లో అతివేగంగా వచ్చి సెంటర్ పాయింట్ డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన సమయంలో సెంటర్‌లో ప్రజలు రద్దీగా ఉండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, ఒకవైపు సింగరేణి కార్యకలాపాల వల్ల గ్రామానికి ముప్పు పొంచి ఉందని, మరోవైపు బొగ్గు టిప్పర్లతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం ఈ సమస్యలపై స్పందించడం లేదని, ప్రభుత్వం కూడా గ్రామ పరిస్థితిని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కిష్టారం గ్రామ ప్రజలకు హామీలు మాత్రమే ఇస్తూ కాలం గడుపుతున్నారని, బొగ్గు టిప్పర్ల వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అలాగే దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా కిష్టారం బీసీ కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ అంశాలపై సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.