అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ కూడలిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ దళపతి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషా భేదాల ప్రభావంతో కొనసాగుతున్న తమిళనాడు రాజకీయాల్లో జెన్ జెడ్ తరం తమ ముద్ర వేసిందని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికారని, సాధారణ కుటుంబాల నుండి వచ్చిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యానికి కొత్త దిశ చూపారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గద్దల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చుంచు రామమూర్తి, కోశాధికారి గద్దల రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసంపల్లి కృష్ణ, ఆర్గనైజర్ చెట్టి సురేష్, మీడియా విభాగం అధ్యక్షుడు జూపెల్లి కిరణ్, సంయుక్త కార్యదర్శి చుంచు ప్రవీణ్, మేకల అంజిబాబు, కొమ్ము రాంబాబు, మిరియాల బాలకృష్ణ, నండ్రు జానకిరామ్, వెంకటేశ్వర్లు, మందా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






