20 April, 2026 | 2:46 AM

కోహెడ మార్కెట్‌లో దళారుల దందా

20-04-2026 12:52 AM
  1. కమిషన్ ఏజెంట్ల ‘కక్కుర్తి’.. నిలువునా మునుగుతున్న అన్నదాత

నిబంధనలకు విరుద్ధంగా 11 శాతం కమీషన్ వసూలు

తరుగు పేరుతో టన్నుకు క్వింటా కోత.. అదనంగా బాక్సుకో కిలో హాంఫట్

ఏడాది కష్టం ఏజెంట్ల పాలు.. పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే.. అడుగడుగునా దళారులు కాటేస్తున్నారు. బాటసింగారంలోని కోహెడ గడ్డి అన్నారం మామిడి మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్ల అరాచకం హద్దులు దాటుతోంది. అటు ప్రకృతి వైపరీత్యాలతో, ఇటు తెగుళ్లతో పోరాడి పండించిన మామిడిని మార్కెట్కు తెస్తే, ఏజెంట్లు ‘కమిషన్’ మరియు ‘తరుగు’ పేరుతో రైతుల రక్తాన్ని జుర్రుకుంటున్నారు.మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం రైతుల నుంచి కేవలం 4 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయాలి.

కానీ, ఇక్కడ ఏజెంట్లు ఏకంగా 11 శాతం కటింగ్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ‘తరుగు’ పేరుతో మరో దారుణానికి ఒడిగడుతున్నారు. ఒక టన్ను మామిడికి ఒక క్వింటా (100 కిలోలు) తరుగుగా తీసేస్తున్నారు. అంటే రైతు తెచ్చిన పంటలో 10 శాతం కేవలం గాలిలోనే కలిసిపోతోందన్నమాట. 22 కిలోల బాక్సులో ఒక కిలో అదనంగా తరుగు తీయడం ఇక్కడి ఏజెంట్ల ‘ఇష్టారాజ్యం’గా మారింది.

లెక్కలు చూస్తే కళ్లు చెదరాల్సిందే!

ఒక టన్ను మామిడి విక్రయిస్తే, కమిషన్ మరియు తరుగు రూపంలోనే రైతు సుమారు రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు నష్టపోతున్నాడు. ఎకరం తోటలో కాయలు కోయడానికి 40 మంది కూలీలకు రూ. 32,000 వరకు ఖర్చవుతోంది. 130 బాక్సుల లోడును మార్కెట్కు చేర్చడానికి రూ. 10,000 వరకు వాహన కిరాయి అవుతోంది. హమాలీ ఖర్చులు, ఇతర మామూళ్లు పోగా.. ఏడాది పాటు కష్టపడిన రైతు చేతికి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. ఏసీ గదుల్లో కూర్చునే ఏజెంట్లు మాత్రం రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుని కోట్లు గడిస్తున్నారు.

బోర్డులకే పరిమితమైన నిబంధనలు..

మార్కెట్ యార్డు ప్రవేశ ద్వారం వద్ద ‘4 శాతం కంటే ఎక్కువ కమిషన్ ఇవ్వకండి‘ అని పెద్ద పెద్ద సూచిక బోర్డులు దర్శనమిస్తాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. ఆ బోర్డులు కేవలం అధికారుల తనిఖీల కోసమే తప్ప, రైతుల ప్రయోజనం కోసం కావని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్లు సిండికేట్గా మారి సాగిస్తున్న ఈ దోపిడీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.

తెలంగాణతో దేశం నలుమూలల నుంచి  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఈ మార్కెట్కు వస్తుంటారు. అయితే, అమ్మకం జరిగిన వెంటనే పూర్తి నగదు చెల్లించకుండా.. కేవలం దారి ఖర్చుల కోసం రూ. 10 వేలు ఇచ్చి పంపిస్తున్నారు. మిగతా డబ్బులు రెండు మూడు రోజుల తర్వాత అకౌంట్లలో వేస్తామని చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రైతు ఏడుస్తున్నాడు.. ఏజెంట్ నవ్వుతున్నాడు..

రాత్రంతా నిద్రలేకుండా సుదూర ప్రాంతాల నుంచి పంటను తెస్తే, ఇక్కడ టన్నుకు 25 వేల వరకు కోసేస్తున్నారు. అడిగితే నోరు మూయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ అస్సలు లేదు.‘ దశరథ, రైతు (హన్వాడ, మహబూబ్ నగర్)

అధికారుల నిర్లక్ష్యం శాపమైంది‘

‘ఏజెంట్లు ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల దగ్గర, అటు వ్యాపారుల దగ్గర ఇద్దరి దగ్గరా కమిషన్లు దండుకుంటున్నారు. మార్కెట్ యార్డులో రైతుల గోడు వినే నాథుడే లేడు.‘

 సత్యనారాయణ, రైతు (కేతేపల్లి, వనపర్తి)

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బాటసింగారం మార్కెట్లో జరుగుతున్న ఈ భారీ కుంభకోణంపై విచారణ జరపాలి. 4 శాతం కమిషన్ నిబంధనను కఠినంగా అమలు చేసి, తరుగు పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని రైతులు వేడుకుంటున్నారు.