24 February, 2026 | 9:38 PM

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా

24-02-2026 12:00 AM
  1. యూజీసీ సమావేశంలో నిర్ణయం..

ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులకు ప్రిన్సిపల్ ప్రత్యేక కృతజ్ఞతలు

మెదక్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) స్వయంప్రతిపత్తి (Autonomous) హోదాను కల్పించింది. కళాశాల సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెలలో జరిగిన కమిషన్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించి, 202627 విద్యాసంవత్సరం నుండి 203031 వరకు ఐదు సంవత్సరాల పాటు స్వయంప్రతిపత్తి హోదా కొనసాగనున్నది. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది.

అంతే కాదు అడ్మిషన్ ప్రక్రియ సులభతరం కానున్నది. ఈ హోదాతో కళాశాల ప్రిన్సిపల్ కు నిర్ణయాధికారం ఉంటుంది. అటానమాస్ హోదాతో విద్యార్థులకు ప్రయోజనం ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హోదా ద్వారా కళాశాలకు విద్యా ప్రణాళికలు రూపొందించుకోవడం, పాఠ్యాంశాల్లో నూతన మార్పులు చేయడం, నైపుణ్యాధారిత కోర్సులను ప్రవేశపెట్టడం, పరీక్షా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం వంటి అనేక విద్యా స్వేచ్ఛలు లభిస్తాయి. స్వయంప్రతిపత్తి హోదా కళాశాల విద్యా ప్రమాణాల మెరుగుదలకు, విద్యార్థుల ఉపాధి అవకాశాల పెంపుకు, పరిశోధనాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. నూతన విద్యా విధానం (NEP 2020) అమలుకు కూడా ఇది బలమైన పునాది కానుంది.

ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపల్, ప్రొఫెసర్ హుస్సేన్.. 

ఈ విజయానికి సహకరించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపక బృందం, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కళాశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరి సహకారం కొనసాగించాలని ఆయన కోరారు.