వానలు కురవాలి.. పాడిపంటలు వర్ధిల్లాలి..
బండల గడ్డ అభయాంజనేయుడి సేవలో ఎమ్మెల్యే కసిరెడ్డి దంపతులు
తలకొండపల్లి, జూలై 21 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వారి సతీమణి మాధవి రెడ్డితో కలిసి గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని ప్రసిద్ధ బండల గడ్డ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు జలకళతో కలకలలాడాలని, రైతాంగం పాడిపంటలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం చేసితీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. భక్తిపారవశ్యంతో సాగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లో ని పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామ ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






