20 March, 2026 | 12:40 PM

సర్వేజనాః సుఖినో భవంతు!

19-03-2026 12:00 AM

కాలం ఇలా.. హరిత కలిత 

నవ పల్లవమ్ములా 

లలిత జ్వలిత రవి కిరణమ్ములా 

అలల కలల వెన్నెల స్వరమ్ములా 

కదిలిపోతుంటేనేగదా..

నేలపై అరుణోదయాలు చంద్రోదయాలు 

మానవులలో మెలుకువలు కదలికలు 

చినుకులూ మొలకలు

మొక్కలూ వృక్షాలు 

మొగ్గలూ పువ్వులు 

కాయలూ ఫలాలు 

జన జీవితాలలో 

నవ్వుల జిలుగులు

నరానరాల్లో ఉరుకులు పరుగులు

నాగరికపు తళుకులు బెళుకులు 

సంప్రదాయ ఆటలు పాటలు


బలదర్పపు విన్యాసాలతో

యుద్ధోన్మాదపు వెర్రిపోకడలతో 

కాలాన్ని కలవరపెట్టకండి 

కలుషితం చేయకండి 

సహనం కోల్పోతే కాలం 

పంచభూతాలు అవుతాయి 

ఏకంగా ముంచుకోస్తుంది ప్రళయం ! 

ప్రకృతి విలయం ముందు 

నిలవలేవు మనిషి అస్త్ర శస్త్రాలు ! 


కాల చరిత్రలో 

ప్రగల్భాలకెప్పుడూ పరిహాసాలే

ప్రలోభాలకెప్పుడూ పరాభవాలే

కుతంత్రాలకెప్పుడూ పరాజయాలే! 


శ్రమకు క్రమశిక్షణకు 

ప్రతిభకు పరిశోధనకు 

నిలకడకు నిబద్ధతకు 

అధ్యయనానికి వివేచనకు 

త్యాగాలకు పోరాటాలకు

సేవాతత్పరతకు

మానవతా స్ఫూర్తికి 

మాతృదేశ భక్తికి

సమోన్నతస్థానమే 

అఖండ విజయమే 


కాలం తన వృత్తంలో

లయబద్ధంగా

ప్రాణికోటి మనుగడకు 

ప్రాణహితంగా కదలాలంటే 

మనిషి వాలకం వాడకుండా 

వడలకుండా ఉండాలంటే

కాలాన్ని తన ధర్మాననుసరించి 

ఋతువుల ఉడుపులు ధరించి 

ప్రసన్నంగా కదలనీయండి

ఈ నవ ఉగాది పర్వదినాన !


తనువుల తపనలకు తాళం వేస్తూ

వెర్రిపోకడలకు కళ్లెం వేస్తూ

మేధో చతురతకు మెరుగులుదిద్దుతూ

విశ్వశాంతికి సమర్పితంగా

కాల ప్రహేళికలో సమయోచితంగా 

అడుగులు వేస్తూ సాగండి 

సర్వే జనాః సుఖినో భవంతు !