మాతా, శిశు మరణాలు అరికట్టాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. కృష్ణ
నాగర్ కర్నూల్, జూన్ 23 ( విజయక్రాంతి): మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. కృష్ణ సూచించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గర్భిణిని 12 వారాల్లోపు నమోదు చేయడం, రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టడం, ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించేలా ప్రసవ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గర్భిణులు తప్పనిసరిగా స్త్రీ వైద్య నిపుణులచే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జూన్ 28న నిర్వహించ నున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ కార్యక్రమాల అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, వైద్యాధి కారులు, పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.






