చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..
సిద్దిపేట రూరల్, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై నవత తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతమడక గ్రామానికి చెందిన భాగాల కృష్ణమూర్తి (38) నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో కొద్ది రోజులుగా నివాసం ఉంటూ, గోల్డ్ స్మిత్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
సిద్దిపేటలో గోల్డ్ స్మిత్ షాపు నడుపుతున్న ఆయన ప్రతిరోజు గ్రామం నుండి సిద్దిపేటకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న తన తల్లి రాజేశ్వరితో కలిసి తన బైక్ పై సిద్దిపేట నుండి ఊరికి వస్తున్న క్రమంలో బండ చర్లపల్లి గ్రామ శివారులో అడవి పందులు అడ్డు రావడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం చనిపోగా, ఆదివారం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






