7 April, 2026 | 9:57 PM

న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ గెలుపు

06-11-2025 12:58 AM

ట్రంప్‌నకు ఝలక్..

  1. భారత సంతతి నేత ఘన విజయం
  2.   34 ఏళ్లలోనే మేయర్ పీఠం సొంతం
  3. పుత్రోత్సాహంలో తల్లి, ఫిల్మ్ మేకర్ మీరా నాయర్

వాషింగ్టన్, నవంబర్ 5 : న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెం దిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యా రు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీనే భారీ మెజార్టీతో గెలిపించారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆఫ్రికా లో జన్మించిన మమ్దానీకి ప్రజలు నగర పగ్గాలు అందించడంతో అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది.

కేవలం 34 ఏళ్ల వయసులోనే మేయ ర్ పీఠాన్ని జొహ్రాన్ మమ్దానీ సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యం త చిన్న వయసుగల మేయర్‌గా అరుదైన గుర్తింపు పొందారు. తన విజయంపై మమ్దానీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తన గమ్యానికి చేరుకున్నట్టు వినూత్న రీతిలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో డెమాక్రెటిక్ పార్టీకి ఈ విజ యం కొత్త ఊపునిచ్చిందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. 

మరోసారి డెమోక్రాట్లకు మద్దతుగా..

జొహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఉగాండాకు చెందిన మహమూద్ మమ్దానీ. మమ్దానీ తల్లి భారతీయ ఫిల్మ్ మేకర్ మీరానాయర్. ఉదారవా ద పురోగామి ఎజెండాతో ప్రచారం నిర్వహించిన మమ్దానీని ప్రజలు గెలిపించడం డెమాక్రెటిక్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో పార్టీకి దూరమైన ఉదారవాద భావజాల జనాలు మరోసారి డెమో క్రాట్లకు మద్దతుగా నిలిచారు. అమెరికాలో సంప్రదాయ వాద భావజాలం వేళ్లూనుకుంటున్న తరుణంలో వామపక్ష, పురోగామి వాద సమర్థకులైన స్వింగ్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీవైపు మొగ్గు చూపారు.

ట్రంప్‌నకు భారీ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ న్యూయార్క్ ప్రజలు మమ్దానీని మేయర్ పీఠంపై  కూర్చోబెట్టారు. మమ్దానీ బయట నుంచి వచ్చిన వ్యక్తి అని, తమవాడు ఎప్పటికీ కాలేడని జాతీయవాద రిపబ్లికన్లు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 50 ఏళ్లలో చూడని స్థాయిలో ఈ సారి ఓటింగ్ నమోదైంది.

నెహ్రూ మాటల్ని గుర్తుచేస్తూ..

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం తరువాత తొలిసారిగా ప్రసంగించిన భారత సంతతి నేత జొహ్రాన్ మమ్దానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటలను గుర్తు చేశారు. ఘన విజయం పొందాక మమ్దానీ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ వ్యాఖ్యను గుర్తుచేశారు.

ఏమిటీ ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ వేదికగా ప్రసంగించారు. నాటి అమృత ఘడియలను నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీగా అభివర్ణించారు. ఆ అద్భుతం శకం రాకముందే నిర్ణయమైందని అన్నారు. నాటి నెహ్రూ మాటలనే బుధవారం మమ్దానీ మళ్లీ ప్రస్తావించారు.

నవశకానికి స్వాగతం..

 ‘ఎన్నికల్లో నా విజయం ఓ చారిత్రాత్మక క్షణం. ఒక శకం ముగిసి.. నవ శకానికి స్వాగతం పలికే ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయి’ అని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ అన్నారు. అణచివేతకు గురైన దేశ ఆత్మ జాగృతమై తన గొంతుక వినిపించిన అద్భుత క్షణం ఇదని కామెంట్ చేశారు. ఈ కొత్త శకంలో న్యూయార్క్ ప్రజలు స్పష్టత, దార్శనికత, ధీరత్వంతో కూడిన నాయకత్వాన్ని చూస్తారని తెలిపారు.

ఇకపై హోరు మరింత తీవ్రం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌నకు మమ్దానీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి సంకోచం లేకుండా ట్రంప్ పేరును ప్రస్తావించి మరీ హెచ్చరించారు. ఈ విజయానికి కారణం న్యూయార్క్‌లోని కొత్త తరం అని అన్నారు. వారి తరఫున తామంతా పోరాడతామని హామీ ఇచ్చారు. రాజరిక వ్యవస్థల్ని కూల్చేశామని వ్యాఖ్యానించారు. ‘ట్రంప్.. మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. మీకు నేను నాలుగే నాలుగు మాటలు చెప్పదలచుకున్నా. ఇకపై హోరు మరింత పెరు గుతుంది. మాలో ఏ ఒక్కరినీ టచ్ చేయాలన్నా మా అందర్నీ ఎదుర్కోక తప్పదు’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో డెమాక్రెటిక్ నేత మమ్దానీ గెలిచి..అత్యంత చిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

పుత్రోత్సాహంలో తల్లి మీరా నాయర్

ప్రముఖ సినీ దర్శకురాలు మీరానాయర్ తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూ యార్క్ మేయర్‌గా ఎన్నికవడంతో ఆమె తొ లిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విక్టరీపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా పోస్ట్ సందడి చేసింది. హార్ట్, బాణసంచా ఎమోజీలతో ‘జోహ్రాన్ యు బ్యూటీ’ అనే శీర్షికతో ఆమె స్టోరీని మళ్లీ పోస్టు చేశారు. 

ఉగాండాలో జననం..

జోహ్రాన్ మమ్దానీ ఉగాండాలో జన్మించారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ, మీరా నాయర్ దంపతుల కుమారుడు. జోహ్రాన్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేఫ్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో వారు స్థిరపడ్డారు. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం వచ్చింది. బ్రాంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.

2017లో డెమొక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరారు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీ తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్  మేయర్‌గా చరిత్ర నెలకొల్పారు. 

మమ్దానీ లవ్ స్టోరీ.. 

న్యూయార్క్ నగర్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఘనమైన విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ చారిత్రాత్మక గెలుపు వెనుక కీలకంగా నిలిచింది మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్ రైటర్ రమా దువాజీ. భర్త విజయంలో ఆమె కీలక పాత్ర నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని అద్భుతంగా, ఆకర్షణీయంగా తయారు చేశారు. లోగోలో బోల్డ్ పసుపు, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి  ఊతమిచ్చిందని సీఎన్‌ఎన్ నివేదిక పేర్కొంది. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని చాటుకోవడంలో ఆమె ఘనత చాటుకున్నారు.

ఎన్నికల రోజు వరకూ చర్చలకు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, మేయర్ పోటీ గురించి ఆన్‌లైన్‌లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక గెలుపుతర్వాత జూన్‌లో ఆమె  ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ ప్రత్యేకంగా నిలిచింది. ‘ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తాజాగా మంగళవారం ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు ఆమె అండగా నిలిచారు. దువాజీ న్యూయార్క్‌కు చెందిన సిరియన్ ఆర్టిస్ట్ రమా దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్‌కు వెళ్లినా ఆమె డల్లాస్‌లో పెరిగారు. దుబాయ్‌లో చదివారు.

ఆమె అనేక జర్నల్స్‌ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ అసెంబ్లీకి మమ్దానీ గెలిచినప్పుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్‌లోని యెమెన్ కేఫ్ క్వాహ్వా హౌస్‌లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని మొదలు పెట్టడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు ‘మోడ్రన్ డే ప్రిన్సెస్ డయానా’ అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం.