04-02-2026 02:01:07 AM
చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం
కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): ఈనెల 11న జరగనున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారని, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చొప్పదండిలోని గుమ్లాపూర్ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నామని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన నిర్వహించే అవకాశం ఉందన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో గత రెండు సంవత్సరాల నుండి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం, రానున్న మూడు సంవత్సరాల్లో చేయనున్న అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామన్నారు.
రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే నిదర్శనమన్నారు. ఏమి చేయని కేసీఆర్ 9 ఏళ్ళు ఉన్నప్పుడు, అనేక సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డులు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. బిజెపి, బీఆర్‌ఎస్ రెండు కలిసి కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానం గెలవకుండా కుట్ర చేస్తున్నారన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఒక సేఫ్ సిటీ, ఒక సెక్యూరిటీ సిటీగా ఉండాలంటే కరీంనగర్ తో పాటు మిగతా మున్సిపాలిటీలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.