22 July, 2026 | 10:54 AM

ఆయిల్ పామ్ సాగుతో ఆర్థిక స్థిరత్వం

22-07-2026 09:56 AM

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల.

ములకలపల్లి,(విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ పంట(ఆయిల్ ఫామ్ పంట) సాగుతో రైతులు ఆర్థికంగా స్థిరత్వం సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అన్నారు.ములకలపల్లిలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, నీటి సంరక్షణ, గోదావరి జలాల వినియోగం తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు.

జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 30 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున బోర్లపై ఆధారపడి వరి సాగు చేయకుండా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.  ములకలపల్లి మండలంలో ప్రస్తుతం 8 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, మరో 10 వేల ఎకరాల్లో సాగు విస్తరిస్తే వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు.ఆయిల్ పామ్‌తో పాటు మునగ, పప్పుధాన్యాలను అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభించడంతో పాటు భూమి సారం పెరుగుతుందని చెప్పారు.  ప్రపంచ మార్కెట్లో మునగ ఆకుకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆదాయాన్ని పెంచే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. 

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయిన వెంటనే సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపనున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తన జీవిత లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.ఆత్మనిర్భర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కంది,మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నదని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి, జిల్లా కలెక్టర్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఏడీఏ రవికుమార్, తాసిల్దార్ స్వాతి బిందు,ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో అరుణ్ బాబు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.