శ్రీ చైతన్య కాలేజీలో భారీ దొంగతనం
కరీంనగర్ క్రేమ్(విజయక్రాంతి): జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన రూ. 5 లక్షల నగదు మరియు సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు: కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ (32) అనే వ్యక్తి గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు.
బీరువాలో దాచి ఉంచిన రూ. 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ను దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి నిందితుడు చూపిన గుర్తింపు మేరకు పంచుల సమక్షంలో కింది సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) నగదు, బంగారం 10 గ్రాముల బంగారు చైన్.
పోలీసుల హెచ్చరిక
నిందితుడు గతంలోనే చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. నేర ప్రవృత్తి గల వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. సకాలంలో నిందితుడిని పట్టుకుని సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు.






