జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
- షాపింగ్ మాల్ ఖాళీగా ఉండటంతో తప్పిన ప్రాణ నష్టం
- అనుమతుల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై అనుమానం
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో పెను ప్రమాదం సంభవించింది. స్థానిక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ’ మంగళగౌరి వస్త్ర దుకాణంలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి భవనం పై అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో వాహనదారులు, స్థా నికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రమాద సమయంలో షాపింగ్ మాల్ ఖాళీ గా ఉండటంతో తృటిలో పెద్ద ప్రాణాపా యం తప్పింది. అయితే దుకాణంలోని ఖరీదైన వస్త్రాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తి గా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంటల పాటు శ్రమిం చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా మళ్లించి, పరిస్థితిని సమీక్షించారు.
ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే ఖచ్చితమైన కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకా లంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర వ్యాపార సంస్థలకు వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఈ ప్రమాదం నేప థ్యంలో భవన నిర్మాణ నిబంధనలపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భవన నిర్మాణ సమయంలో సరైన నిబంధనలు అమలు చేసి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే భద్రతా ప్రమా ణాలు పాటించని భవనాలకు అనుమతులు లభిస్తున్నాయని, తద్వారా సామాన్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత అధికారులు మేల్కొని నగరంలోని వ్యాపార సముదాయాల్లో అగ్నిమాపక భద్రతపై కఠినమైన తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ లో ఉన్న మాంగల్య మంగళ గౌరీ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమా దం సంభవించిన విషయం విదితమే. గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో దుకాణం పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. స్వయంగా హైడ్రా కమిషనర్తో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.




