ప్రజా నమ్మకాన్ని నిలబెట్టి, మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మొయినాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నూతన పాలకవర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం కోకాపేట్లోని ఆయన నివాసంలో మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ దుబ్బా సోనియా దర్శన్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఓటు వేసి గెలిపించారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. రాజకీయ విభేదాలకు తావు లేకుండా మున్సిపాలిటీ అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకోవాలని, స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తీరుస్తూ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని సూచించారు. మొయినాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి విజయం సాధించినందుకు చైర్మన్ దుబ్బా సోనియా దర్శన్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.




