నకిలీ విత్తనాల ముఠా పట్టివేత
- 386 కిలోల బీటీ 3 విత్తనాలు స్వాధీనం
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
చెన్నూర్, మే 18 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలోని భీమారం, చెన్నూర్ మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు సోమ వారం పట్టుకున్నట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వెల్లడించారు. సోమ వారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెండు వేరు వేరు కేసుల్లో పట్టుకున్న సుమారు 386 కిలోలప్రభుత్వ నిషేధితబీటీ-3 పత్తి విత్తనాల వివరాలు వెల్లడించారు.
రెండు కేసుల్లో ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఆంద్రా ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. ఈ ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాల సరఫరాను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల భూమి సారవంతం కోల్పోయి పంటలు నష్టపోయే ప్రమాదముందని, పర్యావరణంపై ప్రభావం చూపెడుతుందని, రైతులు నకిలీ విత్తనాలు వాడవద్దని సూచించారు. ఇలాంటి నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు.






