అన్నదాతలకు అందని రుణమాఫీ
- హైకోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి హరీశ్‌రావు
- ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయాలని కోర్టు సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు తీరుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అర్హులైన అనేకమంది అన్నదాతలకు రుణమాఫీ కావడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం అర్హులైన రైతులకు కూడా అందడం లేదని హరీశ్‌రావు తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే సుమారు 23 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని కోర్టు కు తెలిపారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేద ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని, వారి తరఫున న్యాయం చేయాలని హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోరారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. హరీశ్‌రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. ఇది సామాన్య ప్రజల సమస్య కాబట్టి, వ్యక్తిగత పిటిషన్‌కు బదులుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించారు.
అయితే, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం, ప్రజలసమస్య కాబట్టి ‘పిల్’ దాఖలు చేయాలని హరీశ్‌రావుకు సూచించింది. కోర్టు సూచనను గౌరవిస్తూ హరీశ్‌రావు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. త్వరలోనే ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






