ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ హన్వాడ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకొన్న వారికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సహాయం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అర్హులైన లబ్ధిదారులు తమ వైద్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు (బిల్లులు, మెడికల్ రిపోర్టులు) మా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సమర్పించిన పత్రాలను పరిశీలించి, ప్రాసెస్ చేసి, ప్రభుత్వానికి (సెక్రటేరియట్) పంపించి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేలమంది లబ్ధి పొందగా, మరింత మంది ప్రజలకు ఉపయోగపడేలా విస్తరిస్తున్నామని చెప్పారు.
ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం..
క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బంది సిఎం రిలీఫ్ ఫండ్ కోసమే పనిచేస్తున్నారని, అదనంగా హైదరాబాద్‌లో కూడా సహాయం కోసం ఇద్దరు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మీ పరిసరాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం పొందుతున్న పేద కుటుంబాల వివరాలు, డాక్యుమెంట్లు సేకరించి మా కార్యాలయంలో అందించాలని సూచించారు . పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలబడటం మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, నాయకులు సుధాకర్ రెడ్డి, చెన్నయ్య, మోహన్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, అబ్దుల్ హక్, గోవింద్ యాదవ్, చంద్రమౌళి , కేశవులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






