గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, మే 15 (విజయ క్రాంతి): గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు, సమాజానికి విజ్ఞానాన్ని పంచే విజ్ఞాన నిలయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ’ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల’లో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేష్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకోడే, మేయర్ కోలగని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. యువత కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి నిత్యం కొంత సమయం గ్రంథాలయంలో గడిపితే ఆలోచనా విధానం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు పూర్వ పాఠకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.






