రజబ్ అలీ ఆశయాల సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దాం
చట్టసభలో పేదల గొంతుకైన అలీ స్ఫూర్తి అజరామరం
ఆదర్శవంతమైన విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిదర్శనం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
పాల్వంచ, ఏప్రిల్ 10, (విజయక్రాంతి): అమరజీవి మహమ్మద్ రజబ్ అలీ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ఉద్యమించాలని, అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సీపీఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మహ్మద్ రజబ్ అలి 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలోన సాబీర్ పాషా మాట్లాడుతూ రజబ్ అలీ తన కుటుంబం కంటే పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. సుజాత నగర్ ఎమ్మెల్యేగా సుధీర్గకాలం పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హరిజన, గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారిలో ఒక వ్యక్తిగా మెలిగిన వ్యక్తి రజబలి అని కొనియాడారు. ఆదర్శవంతమైన రాజకీయాలను కొనసాగించిన ఆయనలాంటి వారికి నేటితరం స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
పదవులకోసం కాకుండా సామాన్యుల కోసం పోరాడిన ప్రజానేత అని పేర్కొన్నారు. రజబ్ అలి ఆశించిన మార్పులు సమాజంలో ఇంకా రాలేదని వాటికోసం పోరాడాల్సిన అవసరం కమ్యూనిస్టు కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




