ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం
ప్రాధాన్యతా క్రమంలోనే అభివృద్ధి పనులు కేటాయించాలి
త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సిబ్బంది కొరతను తీర్చేవిధంగా నియమాకాలు చేపట్టండ
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి డివిజన్‌లోనూ ప్రజల అవసరాలను గుర్తించి ముందుకు సాగాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. నగర పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
ప్రధానంగా ఎండకాలం దృష్ట్యా త్రాగునీటి సమస్య పరిస్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య తీవ్రంగా వున్నచోట ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్యాన ఏర్పాట్లు చేయాలనీ, ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం నిరంతరం కృషి చేయాలనీ సూచించారు. ....పతాకంకు సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పనులు పూర్తయితే కార్పొరేషన్లో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిస్కారం లభిస్తుందన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి అదనపు సిబ్బందిని పెంచేలా చూస్తామన్నారు.
విద్యుత్, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల డ్రైన్లు తదితర దీర్ఘకాలిక సమస్యల పరిస్కారంపై తాము ఇప్పటికే ప్రేత్యేక ద్రుష్టి సారించామని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలు లేని ఆదర్శ కార్పొరేషన్ గా కొత్తగూడెం కార్పొరేషన్ ను తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్పొరేషన్ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి వున్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.






