నర్సాయిపల్లిలో చిరుత పులి కలకలం
కోడేరు, మార్చి 8: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నర్సాయిపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నర్సాయిపల్లి నుంచి మైలారం రోడ్డులో చిరుత పులి సంచరించినట్లు ఆదివారం గుర్తించారు. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ డిప్యూటీ రేంజర్ కాశన్న ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ శివకుమార్, బీట్ ఆఫీసర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అక్కడ కనిపించిన కాళ్ల జాడలను పరిశీలించగా అవి చిరుత పులివేనని నిర్ధారించారు. నాలుగు ఐదు రోజులుగా ఎత్తం చివరలో ఉన్న గుడిసె ఈశ్వరయ్య పొలంలో కూడా చిరుత పులి జాడలు ఉన్నట్లు స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఆ పొలంలో కూడా అధికారులు పరిశీలించి చిరుత పులి అడుగుజాడలను గుర్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజర్ కాశన్న మాట్లాడుతూ నర్సాయిపల్లి, మైలారం, ఎత్తం గ్రామాల రైతులు తమ పశువులు, గొర్రెలను పొలాల్లో వదలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.




