గెంటేయక ముందే వెళ్లిపోండి!
- వలసలను ఉపేక్షించం
- తిండిపెట్టి మేపేందుకు బంధువులు కాదు
- చొరబాటుదారులకు పశ్చిమ బంగాల్ సీఎం సువేందు వార్నింగ్
కోల్‌కతా, మే 26: చొరబాటుదారులు పశ్చిమ బంగాల్ నుంచి వెళ్లగొట్టకముందే పారిపోవాలని, వారికి ఆశ్రయమిచ్చి తిండిపెట్టేందుకు వారేమీ మన బంధువులు కాదని, చట్టానికి లోబడే ఈ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సీఎం సువేందు అధికారి మంగళవారం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తీవ్ర కలకలం రేగి పలాయనం చిత్తగించేందుకు సరిహద్దు వద్ద చొరబాటుదారులు వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. భారత్ నుంచి వచ్చే తమ పౌరుల ను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే బంగ్లాదేశ్ తెలిపిందన్నారు.
వారిని అక్కడికి తీసుకువెళ్లడం వారి బాధ్యత అన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. చొరబాటుదారులను జైల్లో పెట్టి ఆహారం పెట్టేందుకు వాళ్లు ఏమైనా మన అల్లుళ్లా?’ అని ప్రశ్నించారు. దేశ వనరులను దుర్వినియోగం కానీయమన్నారు. బంగ్లా, రోహిం గ్యా పౌరులు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సరిహద్దుల వైపు పరుగులు..
అక్రమ వలసదారుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025’ (వలసలు, విదేశీయుల చట్టం 2025) అమలుతో బంగాల్ సరిహద్దుల్లో అలజడి మొద లైంది. ఈ సరికొత్త చట్టం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్, ఆపై స్థాయి పోలీసు అధికారులకు ఎలాంటి వారెంట్ లేకుండానే అనుమానితులను అరెస్ట్ చేసే అత్యున్నత అధికారాలు లభించాయి. ప్రభుత్వం చొరబాటు వ్యతిరేక చర్యలను తీవ్రతరం చేసింది. ఈ పరిణామాలతో భయాందోళనలకు గురైన బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి వెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు.
రూ.౫కే చేపల కూర, అన్నం
చేపల కూర బెంగాలీల ప్రియమైన వంటకం. వారి జీవితంలో చేపల కూర ఒక భాగం. సంప్రదాయ వంటకాల్లో చేపలదే పెద్దపీట. అంత ముఖ్యమైన వంటకాన్ని అన్నంతో కలిపి రూ.౫ కే ప్రజలకు అందించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ౪౦౦కి పైగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. గతంలో చేపల స్థానంలో గుడ్డు ఉండగా, కొత్త ప్రభుత్వం చేపలను భర్తీ చేసిందన్నమాట.






