21 May, 2026 | 3:49 AM

సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌తోనే ‘పాలమూరు’ సమగ్ర అభివృద్ధి

21-05-2026 01:31 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఫ్యూచర్ సిటీ’తో మారనున్న ప్రాంత ముఖచిత్రం.. 

యువతకు ఉపాధి అవకాశాలు

టీజీపీ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి ఘన సన్మాన సభలో నేతల ఉద్ఘాట

ఆమనగల్లు, మే 20 (విజయక్రాంతి): సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ (పాలమూరు) ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొనియాడారు. వార్డు మెంబర్, జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయి సమస్యలపై, ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందన్నారు.

బుధవారం ఆమనగల్లు పట్టణంలో టీజీపీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన సీనియర్ నేత సూదిని రాంరెడ్డికి కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మాన సభ నిర్వహించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ట్రిబ్యునల్ మెంబర్ కృష్ణగౌడ్, రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్, సీఎం మామలు పద్మారెడ్డి, మనోహర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యేలు రాంరెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కొంత ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రూపురేఖలు ఊహించని విధంగా మారబోతున్నాయన్నారు.

గత 2, 3 నెలలుగా ఇక్కడికి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారని, దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుని భూముల ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.కొత్త సిటీ ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు మౌలిక వసతుల కల్పనకు సీఎం పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.దాదాపు 45 ఏళ్లుగా సర్పంచ్ స్థాయి నుంచి పార్టీకి నిజాయితీగా సేవలందించిన సీనియర్ నేత సూదిని రాంరెడ్డిని గుర్తించి సముచిత పదవి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో స్థానిక నేతలు బాలాజీ సింగ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్ వంటి వారి సేవలను కూడా గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అల్లుడి దగ్గర కూర్చోనైనా నిధులు తేవాలి..

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో సీఎం ఇచ్చిన హామీల మేరకు రావాల్సిన రూ. 290 కోట్ల నిధులు సకాలంలో మంజూరయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అల్లుడైన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోనైనా.. మన ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన నిధులు వచ్చేలా మామలుసూదిని పద్మారెడ్డి, మనోహర్ రెడ్డిలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి చమత్కరిస్తూనే, నిధుల సాధనపై పట్టుబట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 1,400 కోట్లతో పలు అభివృ ద్ధి పనులు సాగుతున్నాయని వివరించారు.

సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సూదిని రాంరెడ్డి..

ట్రిబ్యునల్ చైర్మన్ రాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని, తన సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరువనని, ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు కొత్తకూర్మ శివకుమార్, బట్టు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,పాలకుర్ల రవికాంత్ గౌడ్,బృంగి ఆనంద్, జగన్, వెంకటేశ్వర్లు, కేశవులు, రఘు రాములు, అశోక్ రెడ్డి, పర్వత రెడ్డి, కొండల్ రెడ్డి, అనంత రెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.