బాబోయ్ కొండముచ్చులు
ట్రాక్టర్ సౌండ్ వింటే చాలు వాలుతున్న కొండముచ్చులు
చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు
షాద్‌నగర్,(విజయక్రాంతి): కొడెంగలు.. ఒక గ్రామాన్ని హడలు కొడుతున్నాయి.. ఫరూక్ నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. గ్రామంలో రోజురోజుకు విపరీతమవుతున్న కొండముచ్చుల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం నక్కల అనిత అంజయ్య గౌడ్ పై ఈ కొండముచ్చులు దాడి చేసి గాయపరిచాయి. గ్రామంలో ఇది కొత్త కాదు.. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె అత్తమ్మ దన్నారం నక్కల సత్యమ్మ పైన కూడా ఈ కొడెంగలు దాడి చేయడంతో ఆమె చనిపోయింది.
ఇక తరచూ ఎవరు కనిపించిన ఈ దాడులు చేస్తూ ఇబ్బంది గురి చేస్తున్నాయి. ట్రాక్టర్ కనిపిస్తే చాలు వాటి మీద ఎక్కి హల్చల్ చేస్తున్నాయి. పంట పొలాలను పాడు చేస్తున్నాయి. తీవ్రమైతున్న ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి తల్లి పై కూడా ఇవి దాడి చేశాయి. అస్తమానం గ్రామంలో కొడంగల బాధ వర్ణనాతీతం అయింది స్థానిక పాలకులు వీటిని తరిమెందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






