15 August, 2026 | 5:59 PM

బొమ్మరాసిపేటలో బీఆర్ఎస్ నాయకులకే భూములు

15-08-2026 05:02 PM

 కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేదు 

డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ స్పష్ఠీకరణ 

మేడ్చల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం లోని బొమ్మరాసిపేటలో వివాదం కొనసాగుతున్న సర్వే నెంబర్లలో బి ఆర్ ఎస్ నాయకులకే భూములు ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం షామీర్పేట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఆ భూమిలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 2023 జూలై 15వ తేదీన ఆ పార్టీ కి చెందిన నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆ భూమిలో ఉన్నవారు రైతులు కాదు కబ్జాదారులని రాయించారని, ప్రస్తుతం బాధిత రైతులని రాయించడం విచిత్రంగా ఉందన్నారు. బి ఆర్ ఎస్ నాయకుల, నమస్తే తెలంగాణ పత్రిక ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

అధికారంలో ఉన్న సమయంలో కబ్జాదారులు అధికారం లేనప్పుడు బాధిత రైతులు ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. తాను, అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి కబ్జాకు పాల్పడుతున్నామని ఆరోపణ చేయడం అర్ధరహితమన్నారు. ఆ భూమి తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిగజారి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. తాను గజం భూమి ఆక్రమించినట్లు రుజువు చేస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద కబ్జాదారుడిగా పేరు అందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ నాయకుల పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మల్లారెడ్డి షామీర్పేట చెరువును ఆక్రమించి హోటల్, ఫంక్షన్ హాల్ నిర్మించాలని, విద్యాసంస్థలన్నీ చెరువులు, ప్రభుత్వ భూముల్లో నిర్మించారని ఆయన ఆరోపించారు. చాటుమాటుగా వెళ్లి సీఎంను కలిసి కాళ్లు పట్టుకోవడం వల్ల విద్యాసంస్థలు నడుస్తున్నాయన్నారు. మల్లారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తన జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జోలికి వస్తే భస్మం అవుతారన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, భీమిడి జైపాల్ రెడ్డి, తుర్కపల్లి వేణుగోపాల్ రెడ్డి, నక్క సందీప్ గౌడ్, ఉదండాపురం సత్యనారాయణ, వేముల శ్రీనివాసరెడ్డి, చాపరాజు, రామన్న గారి రాఘవేందర్ గౌడ్, సాయి పేట శ్రీనివాస్, చీర్ల రమేష్, కౌడే మహేష్ తదితరులు పాల్గొన్నారు.