అనుముల బ్రదర్స్‌కు భూములు కారుచౌక
- ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా కొండల్‌రెడ్డి
- ఆ బిజినెస్ మోడల్ తెలంగాణ బిడ్డలకు చెప్పండి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని మేము కష్టపడి ‘టీ నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటుచేయడంలో బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు. ‘ఇది ఫ్యామిలీ -రన్.. ఫ్యామిలీ -డ్రైవ్ స్కామ్, ఇందులో జీరో ఇన్నోవేషన్.. జీరో ఎంప్లాయీస్’ అని ఎద్దేవా చేశారు. కానీ వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాత్రం కారుచౌకగా కేటాయింపు చేశారని తెలిపారు.
అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా భూములు దక్కించుకోవచ్చని స్పష్టం చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా.. సీఎం సోదరులు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. లక్ష రూపాయల పెట్టుబడితో వందల కోట్ల భూములు కొట్టేసే బిజినెస్ మోడల్‌ను తెలంగాణ బిడ్డలకు కూడా చెప్పండి అంటూ రేవంత్ రెడ్డికి శ్రీధర్‌బాబుకు చురకలు అంటించారు. రూ. 1 లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్‌తో, ఒక్క ఉద్యోగి కూడా లేని ‘టెస్సారాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రై.లి’ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ. 200 కోట్ల లాభం/ఆస్తి ఆర్జించిన ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా అనుముల కొండల్ రెడ్డి’ని ప్రకటించాల్సిందే అని ఎద్దేవా చేశారు.
శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన బిజినెస్ మోడల్ ఏంటో నేర్పించాలని హితవు పలికారు. వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి.. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ యువత మొత్తానికి ఈ అనుముల హబ్ అవకాశాన్ని కల్పించాలని సూచించారు.






