23 June, 2026 | 11:38 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

తుర్కయాంజాల్‌లో భూవివాదం

20-06-2026 12:00 AM
  1. రెవెన్యూ అధికారులపై మహిళ దాడి
  2. పోలీస్ స్టేషన్ ఎదుట సిబ్బంది ధర్నా

అబ్దుల్లాపూర్మెట్, జూన్ 19 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్లో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దౌర్జన్యానికి దిగి, దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను నిరసిస్తూ, తమకు రక్ష ణ కల్పించాలంటూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

14 ఎకరాల పట్టా భూమి మాదే.. బాధితురాలి వాదన

తుర్కయంజాల్ పరిధిలోని సర్వే నంబర్ 338 లో గల 1810 గజాల స్థలం చుట్టూ గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై సరస్వతి అనే మహిళ మాట్లాడుతూ.. ఈ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 14 ఎకరాల భూమికి తామే పట్టాదారులమని, అందులో మిగిలిన 1810 గజాల స్థలం తమదేనని స్పష్టం చేసింది. కొంతమంది రాజకీయ నాయకుల కన్ను తమ భూమిపై పడిందని, వారి అండదండలతోనే రెవెన్యూ అధికారులు దీనిని ప్రభుత్వ భూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. పట్టా భూమిలోకి రావడానికి రెవెన్యూ అధికారులకు ఏం పని అని ప్రశ్నిస్తూ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని వెల్లడించింది.

అధికారులపై దాడి.. అసలేం జరిగింది?

మరోవైపు, ఆదిభట్ల పోలీసుల నివేదిక మరియు సీఐ విజ్ఞప్తిని పరిశీలించిన ఆర్డీఓ  సదరు వివాదాస్పద భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అబ్దుల్లాపూర్ మెట్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్  ప్రేమ్ కుమార్, జీపీవో హన్మంతు నాయక్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

అధికారులు అక్కడికి చేరుకోగానే సరస్వతి అనే మహిళ వారిని అడ్డుకుంది. గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ వినకుండా.. ఆర్‌ఐ ప్రేమ్ కుమార్ గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లిందని, ఐడీ కార్డును లాక్కొని దుర్భాషలాడిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జీపీవో హన్మంతును ఆమె కులం పేరుతో దూషించినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న తమపై బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడిందంటూ రెవెన్యూ సిబ్బంది ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్ ఎదుట రెవెన్యూ సిబ్బంది ధర్నా

తమ సహోద్యోగులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ‘వీ వాంట్ జస్టిస్‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహించే ఫీల్ సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి.ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన సరస్వతి అనే మహిళపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.ధర్నా నేపథ్యంలో ఆదిభట్ల సీఐ రవి కుమార్ స్పందిస్తూ.. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.