వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి
లేకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం: తోటపల్లి శంకర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వెంటనే విబిజి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలని లేనిచో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల ఉద్యమాలను ఉదృతం చేస్తామని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ మేడ్చల్ జిల్లాకార్యదర్శి తోటపల్లి శంకర్ హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా బికేఎంయు అధ్యక్షులు తప్పెట్ల రాములు గౌడ్ అధ్యక్షతన మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ప్రదర్శన, ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరై తోటపల్లి శంకర్ ప్రసంగిస్తూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఎంజి నరేగాను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి దాని స్థానంలో కార్మిక ప్రయోజనాలను కాలరాసే విబిజి రామ్ జి చట్టాన్ని తెచ్చి దానిని జులై ఒకటి నుండి అమలు జరిపేందుకు మే 11 న జారీ చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలతో 25 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదముందన్నారు.
ఉపాధి పనులకు గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాష్ట్రప్రభుత్వం 10 శాతం నిధులు భరించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వము 60 శాతము రాష్ట్ర ప్రభుత్వము 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుందని , ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలపై పెను భారం పడి ఉపాధి పనులు మూలకు పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే మోడీ ప్రభుత్వం కార్మికుల ఉపాధి హక్కును హరిస్తున్న వీబీజీ రామ్ జీ ని రద్దుచేసి ఎంజి నరేగా ను పునరుద్ధరించాలన్నారు. 3 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయోంచి సంవత్సరంలో 200 రోజులు పనులు కలిగించి రోజుకు 700 రూపాయల కూలీ ఇవ్వాలన్నారు.
ఆరోగ్య భీమా మరియు మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని,పని ప్రదేశాలలో కనీస మౌలిక సదుపాయాలు కలిగించాలని లేనిచో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు తమ హక్కులు, గౌరవం, జీవనోపాధిని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య పోరాటాలు తీవ్రతరం చేయవలసి వస్తుందని తోటపల్లి శంకర్ హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి వర్గం వ్యవసాయ కార్మిక డిమాండ్స్ పై ప్రధానమంత్రి కి సమర్పించే వినతి పత్రాన్నిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓఎస్ మాలతికి అందజేశారు.






