4 May, 2026 | 6:50 PM

సదాశివపేటలోని డీసీఎంఎస్ కేంద్రం సందర్శించిన కేటీఆర్

04-05-2026 05:15 PM

* రైతుల ఇబ్బందులపై తీవ్ర విమర్శలు 

* రాబోయే వారం రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని 

* ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్న కేటీఆర్

సదాశివపేట: సదాశివపేటలోని డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రైతులు శనగలు వేసి నెలరోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అందలేదని, కేంద్రంలో సరిపడా సంచులు కూడా లేవని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన కేటీఆర్, గత బిఆర్ఎస్  ప్రభుత్వ కాలంలో మొక్కజొన్న కొనుగోలుకు 750 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 80 కేంద్రాలకే పరిమితమైందని విమర్శించారు.45 డిగ్రీల ఎండలో రైతులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం రైతులను దళారుల చేతుల్లోకి నెట్టేస్తోందని ఆయన ఆరోపించారు.

కొనుగోలు కేంద్రంలో వర్షం పడితే ధాన్యాన్ని కాపాడేందుకు కనీస సదుపాయాలు కూడా లేవని, రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రైతుల నుంచి ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే వారం రోజుల్లో ఆందోళనలను మరింత ఉదృతం చేసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని హెచ్చరించారు.