నిరాడంబరంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోవద్దని, కేవలం ప్రజా సేవకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు చేపట్టారు.
రేగుర్తి బధిరుల ఆశ్రమ పాఠశాలలో నోటు పుస్తకాలు, పెన్నులు మరియు స్టేషనరీ పంపిణీ చేశారు.మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, బాటసారులకు అల్పఆహార వితరణ చేపట్టారు.కార్యక్రమాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






