24 July, 2026 | 4:41 PM

బల్క్ ల్యాండ్ సమస్యల పరిష్కారానికి సర్వే వేగవంతం చేయాలి

24-07-2026 03:50 PM

గ్రామాల వారీగా నివేదికలు – పెండింగ్ దరఖాస్తులపై చర్యలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): బల్క్ ల్యాండ్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బల్క్ ల్యాండ్, రీ సర్వే, ఎస్‌ఐఆర్ నమోదు అంశాలపై అధికారులతో చర్చించారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహించి పెండింగ్ సమస్యలపై నివేదికలు సమర్పించాలని తహసీల్దార్లకు సూచించారు. నివేదికల ఆధారంగా సంబంధితులకు నోటీసులు జారీ చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ సర్వే కొనసాగుతున్న గ్రామాల్లో బల్క్ ల్యాండ్ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పైలెట్ గ్రామాల నివేదికలను వెంటనే అందజేయాలని తెలిపారు.

రీ సర్వే పనుల్లో సమన్వయం కీలకం

మండలాల వారీగా సమన్వయం చేసుకుని సర్వే నిర్వహించాలని, విధులు నిర్వర్తించని లైసెన్స్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే జరుగుతున్న విషయాన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని, రైతులు సహకరించాలని కోరారు.

సాధాబైనామా దరఖాస్తులపై దృష్టి

జిల్లాలో సాధాబైనామా కింద మొత్తం 39,300 దరఖాస్తులు అందగా, 26,698 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నోటీసులు జారీ చేసి వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ వేగవంతం

జిల్లాలో ఎస్‌ఐఆర్ నమోదు 83 శాతం పూర్తయిందని, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో 99 శాతం పూర్తికాగా, భూపాలపల్లి మున్సిపాలిటీలో 70 శాతం మాత్రమే ఉన్నందున ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ పురోగతి నివేదికలు సేకరించి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమన్వయం

పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేసి బీఎల్‌ఏలకు అందజేయాలని, వారిని భాగస్వాములుగా చేర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్వో వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.