అధిక ధరలకు ఎరువులు.. విక్రయాలా?
రైతుల ఆందోళన... నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న.. ఒక్క నిమిషంలోనే, ఆన్లైన్లో బస్తాలు ఖాళీ
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పలు ఫెర్టిలైజర్స్‌లో యూరియా, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి జోరుగా వినపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... ప్రభుత్వం నిర్ణయించిన డీఏపీ బస్తా ధర రూ.1,350 కాగా, దానిని రూ.1,800కు విక్రయిస్తూ ఒక్కో బస్తాపై సుమారు రూ.400-450 అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బిల్లులో మాత్రం రూ.1,350 మాత్రమే నమోదు చేసి, మిగిలిన రూ.450 ను నగదు లేదా ఫోన్‌పే ద్వారా వసూలు చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు.
వ్యవసాయ సీజన్‌లో ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం రైతులపై అదనపు భారం మోపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆరోపణల తుంగతుర్తి సర్కిల్ పరిధిలోని మద్దిరాల మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణంపై సుమారు 10–15 రోజుల క్రితం అధికారులు చర్యలు తీసుకుని, షాపును సీజ్ చేసినప్పటికీ, అనంతరం తిరిగి తెరిచి, మళ్లీ అదే విధంగా అధిక ధరలకు ఎరువుల విక్రయాలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. అలాగే, కొంతమంది ఫెర్టిలైజర్ వ్యాపారుల అక్రమాలకు వ్యవసాయ శాఖ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు కూడా రైతులు చేస్తున్నారు.
అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ ఏఓతో పాటు, తుంగతుర్తి వ్యవసాయ సంచాలకులు, జిల్లా సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ఎరువుల ధరల జాబితాను నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించేలా, వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసి, వాటి అమలును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా, రైతులు కూడా నోటీస్ బోర్డులో పేర్కొన్న ధరలకే ఎరువులు కొనుగోలు చేయాలని, నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినట్లయితే వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తుంగతుర్తి సర్కిల్ పరిధిలోని కొన్ని ఫెర్టిలైజర్ షాపులో యాజమాన్యం ఇస్తారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారని, దీనికి వ్యవసాయ సంచాలకుల తోడుగా ఉన్నారని, జోరుగా ఆరోపాలను వస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్ జరుగుతున్న సంఘటనపై, సమగ్ర విచారణ జరిపి, గ్రామాల్లోని రైతులకు ఆన్లైన్లో యూరియా బస్తాలు దొరికే విధంగా, న్యాయం చేయాలని, అధిక ధరలకు అమ్ముతున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.






