పేదల ఇండ్లు కూల్చడానికే సర్పంచ్‌గా గెలిచారా..? కనకమామిడిలో ఉద్రిక్తత!
* పెద్దల కబ్జాలు వదిలేసి పేదలపై ప్రతాపమా?.. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ఫైర్!
మొయినాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దాలుగా ప్రజలు వినియోగిస్తున్న రహదారిపై, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా స్థానిక తహసీల్దార్ గౌతమ్ ఆధ్వర్యంలో అధికారులు పేదల ఇండ్ల కూల్చివేతకు సిద్ధమవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఏకపక్ష చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన కొందరు బాధితులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు సమయస్ఫూర్తితో వారిని అడ్డుకోవడంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.
బాధితులకు కే.ఎస్. రత్నం భరోసా
విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం శనివారం ఉదయమే హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పేదల ఇండ్లపై అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాలకు గురైతే కన్నెత్తి చూడని అధికారులు, కష్టపడి జీవించే నిరుపేదల ఇండ్లను టార్గెట్ చేయడం వెనుక సర్పంచ్ భర్త కక్షసాధింపు ధోరణి దాగి ఉందని ఆరోపించారు.
ఆర్డీవోతో ఫోన్ లైన్లో నిలదీత
అనంతరం కే.ఎస్. రత్నం ఫోన్ ద్వారా ఆర్‌డీఓతో మాట్లాడి, అధికారుల ఏకపక్ష వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టం పేరుతో బలహీనులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. రహదారి ఆక్రమణలు తొలగించాలనుకుంటే కనకమామిడి గేట్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న ప్రతి ఆక్రమణను తొలగించాలని, అందరికీ ఒకే న్యాయం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పెద్దల వద్ద వచ్చే లంచాలకు అలవాటు పడి పేదల పొట్ట కొడితే సహించేది లేదని హెచ్చరించారు.
* ఉద్యమానికి సిద్ధం: బీజేపీ
కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనకమామిడి ప్రశాంత వాతావరణాన్ని కంపు చేయవద్దని రత్నం హితవు పలికారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పేదల కన్నీటి శాపం మంచిది కాదని, ఇలాంటి అక్రమ కూల్చివేతలు ఆపకపోతే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించారు. బాధితులకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని, అవసరమైతే జెండా పాతి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.






