21 May, 2026 | 3:12 AM

కోల్‌కథ.. ఇంకా ఉంది

21-05-2026 01:10 AM

ముంబై బ్యాటర్ల ఫ్లాప్ షో

4 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు

కీలక పోరులో ముంబైపై గెలుపు

సమిష్టిగా రాణించిన బౌలర్లు

మనీశ్ పాండే, పావెల్ మెరుపులు

ఐపీఎల్ 19వ సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. కీలక మ్యాచ్ లో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తే.. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, పావెల్ మెరుపులు మెరిపించారు. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. 

కోల్‌కతా, మే 20: హార్థిక్ పాండ్యా రీఎంట్రీతో ముంబై రాత మారుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ త్వరగానే ఔటయ్యారు. నమ న్ ధీర్ కూడా నిరాశ పరిచాడు. తర్వాత సూర్యకుమార్ యా దవ్ కూడా తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేయడంతో ముంబై 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది.  మళ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత  ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్యా , తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 49 బంతుల్లో 43 పరుగులు జోడించారు. తిలక్ వర్మ ఒక సిక్సర్ తో 20 పరుగులకే ఔటయ్యాడు.

తిలక్ అవుటైన కాసేపటికే హార్థిక్ పాండ్యా (26)కూడా వెనుదిరగడోం ముంబై 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కనీసం 120 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి.  చివరి రెండు ఓవర్లలో కార్బిన్ బాష్, దీపక్ చాహర్ ధాటిగా ఆడడంతో ముంబై ఇండియన్స్ 147 పరుగులు చేయగలిగింది. కార్బిన్ బాష్ 18 బంతుల్లో 32(3 ఫోర్లు, 2 సిక్సర్లు) దీపక్ చాహర్ 7 బంతుల్లో 10 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

కోల్కతా బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఛేజింగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తడబడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (8) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత రహానే, మనీశ్ పాండే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ 38 పరుగులు జోడించారు. రహానే (21) ఔటైనా కాసేపటికే కామెరూన్ గ్రీన్ (4) కూడా నిరాశ పరిచాడు. ఈ దశలో పాండేకు, హిట్టర్ పావెల్ జత కలిసాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.

మధ్య మధ్యలో పావెల్ భారీ షాట్ల కొట్టడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరగకుండా జాగ్రత్త పడింది. అయితే చివర్లో మనీశ్ పాండే 33 బంతుల్లో 45 (6 ఫోర్లు), పావెల్ 30 బంతుల్లో 40 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) వెంటవెంటనే ఔటవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో రింకూ సింగ్ 9 నాటౌట్, అంకుల్ రాయ్ 4 నాటౌట్ మ్యాచ్ ను ముగించారు. కోల్‌కతా మరో 7 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని అందుకుంది.

స్కోరు బోర్డు 

ముంబై ఇన్నింగ్స్ : 147/8 ( బోస్చ్ 32 నాటౌట్, హార్థిక్ 26, తిలక్ వర్మ 20 ; గ్రీన్ 2/23, కార్తీక్ త్యాగి 2/37, దూబే 2/34)

కోల్‌కతా ఇన్నింగ్స్ : 148/6 ( మనీశ్ పాండే 45, పావెల్ 40, రహానే 21; బోస్చ్ 3/30 , బుమ్రా 1/26)