calender_icon.png 22 February, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామంతపూర్ లో కిడ్నాప్‌ డ్రామా

22-02-2026 06:15:19 PM

ఉప్పల్,(విజయక్రాంతి): తన భర్తను కిడ్నాప్‌ చేశారని ఓ వివాహిత ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు గేటు బయటకు తీసుకెళ్లి వాహనంలో ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని, రెండు రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఉండటంతో ఆమె ఆందోళన చెందింది. తన భర్త ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్నఉప్పల్ పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ప్రియురాలితో గడపడానికి ఆమె భర్త వెళ్లినట్లు తెలిసింది.

పోలీసులు, బాధితురాలి వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ డివిజన్‌లోని గాంధీనగర్‌ జనప్రియ అపార్టుమెంటులో నివసించే రావూరి పూర్ణచందర్‌ భార్య,తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. అతను మాదాపూర్‌లోని పబ్‌లో పర్చేజ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి డోర్‌బయట గడియపెట్టి వెళ్లాడు. నడుచుకుంటూ బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచిన భార్య.. భర్త కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కిడ్నాప్‌ చేశారని ఆందోళన చెందింది.

అతను పనిచేసే పబ్‌కు వెళ్లి తన భర్తను కిడ్నాప్‌ చేశారని చెప్పింది.పబ్‌ నిర్వాహకులు సైతం మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు ఆమెను విచారించగా అసలువిషయం బయటపడింది. పబ్‌లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. పబ్‌లో పనిచేసే యువతులతో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు పోలీసులు గ్రహించారు. వారి ఫోన్‌ నంబరు లోకేషన్‌ను పరిశీలించగా ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది.