పర్యాటక గుమ్మం ఖమ్మం..
- కొత్త శోభతో ’హరిత భవన్’
- ‘రూ.40 కోట్లతో నిర్మాణం..
- ‘మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ
- ‘సచివాలయంలో మంత్రి సమీక్ష..
- ‘మంత్రి జూపల్లికి లేఖ రాసిన తుమ్మల..
- ‘నిధులు వెంటనే మంజూరుకు విజ్ఞప్తి
ఖమ్మం, జూలై 15(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాను రాష్ట్ర పర్యాటక పటంలో మరింత ప్రముఖంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ‘ఖమ్మం జిల్లా పర్యాటక గుమ్మంగా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి పర్యాటక, ఆతిథ్య మౌలిక సదుపాయాల కొరతను ప్రతిపాదిత హరిత భవన్ పూర్తిగా తీరుస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లకారంపార్క్ సమీపంలో నిర్మించనున్న ’హరిత భవన్’ ప్రాజెక్టుపై మంగళవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
‘హరిత హోటల్ కాదు.. హరిత భవన్‘
సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు లకారంపార్క్ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించనున్న ఆధునిక హోటల్ ప్రణాళికను మంత్రి తుమ్మలకు సమగ్రంగా వివరించారు. ప్రతిపాదిత నిర్మాణానికి తొలుత ’హరిత హోటల్’ అని పేరు పెట్టగా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘దీనిని ’హరిత భవన్’గా మార్చండి‘ అని మంత్రి తుమ్మల సూచించారు.
‘వెంటనే ప్రతిపాదనలు తీసుకురండి: తుమ్మల‘
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.40 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు మంత్రికి వివరించగా.. ‘సంబంధిత ప్రతిపాదనలను వెంటనే సమర్పించండి. అవి అందిన వెంటనే పరిపాలనా అనుమతిని త్వరితగతిన మంజూరు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదు‘ అని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సరీత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ నరేష్, కన్సల్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు.
మంత్రి జూపల్లికి తుమ్మల లేఖ..
సత్వర నిధులు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల జూపల్లిని కోరారు.జిల్లా అభివృద్ధి పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ.. జూలై 14న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. హోన్బుల్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. అందులో.. ‘తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నియమించిన కన్సల్టెంట్ ఈ ప్రాజెక్టుకు తాత్కాలిక అంచనా వ్యయాన్ని రూ.40 కోట్లుగా సమర్పించారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం హరిత భవన్ ఏర్పాటు కోసం 5 ఎకరాల భూమిని గుర్తించి కేటాయించిందని పేర్కొన్నారు.
‘ఖమ్మం జిల్లా ముఖచిత్రమే మారుతుంది‘ జూపల్లికి విజ్ఞప్తి
‘జిల్లాకు వచ్చే పర్యాటకులు, భక్తులు, వాణిజ్య సందర్శకులు, అధికారులకు ఈ భవన్ నాణ్యమైన వసతి కల్పించడంతో పాటు.. సదస్సులు, సమావేశాలు తదితర కార్యక్రమాలకు అత్యుత్తమ వేదికగా ఉపయోగపడుతుంది‘ అని లేఖలో మంత్రి తుమ్మల వివరించారు. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ‘ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతపై మంజూరు (శాంక్షన్) ఇవ్వాలని, టెండర్ల ప్రక్రియను చేపట్టి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని‘ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా నిజమైన అర్థంలో రాష్ట్ర పర్యాటక గుమ్మంగా వెలుగొందుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






