15 June, 2026 | 4:01 PM

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు

15-06-2026 03:14 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు కాలనీ గేట్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో తాగునీటి కొరతతో పాటు పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

కేసీఆర్ నగర్ అనే పేరు ఉన్నందుకే తమ కాలనీని నిర్లక్ష్యం చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాలనీవాసులు, వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనతో కాలనీలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.