calender_icon.png 19 February, 2026 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతనపల్లి.. కదనరంగం

19-02-2026 01:14:17 AM

  1. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ 
  2. బాల్క సుమన్‌తో సహా నలుగురికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ 
  3. భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు..

మంచిర్యాల, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు బుధవారం భారీగా తరలి వచ్చా రు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

బాల్క సుమన్ ఇంటి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇంట్లోకి చొచ్చుకొనివెళ్లి.. బాల్క సుమన్‌ను పోలీసులు చేతులపై ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలోకి నెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు రాళ్ల దాడి చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు, విధులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం బాల్క సుమన్‌ను అరెస్టు చేసి, శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాలలోని ఫస్టు క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్కసుమన్ సహా నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

సుమన్ ఇంటి చుట్టూ వందలాది మంది బీఆర్‌ఎస్ నేతలు

బాల్క సుమన్ ఇంటి చుట్టూ మంగళవారం రాత్రి నుంచి మద్దతుగా వందల మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరారు. మరోవైపు బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు సంయుక్తంగా ఇచ్చిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నాయి. పోలీసులు బుధవారం ఉదయం నుంచి బాల్క సుమన్‌ను అరెస్టు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఉదయమే మూల రాజిరెడ్డితో పాటు మరికొందరిని అందులోకి తీసుకున్నారు.

బుధవారం సాయంత్రం బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడం కోసం ఏసీపీ రవికుమార్ సుమారు 200 నుంచి 300 మంది పోలీస్ బలగాలతో చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్ద సైతం వందల సంఖ్యలో నాయకులు, పోలీసులు ఉండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, బాల్కసుమన్ అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్ గురువారం మంచి ర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

బల్దియా మీకు దక్కదు.. బాల్క సుమన్

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో మంచిర్యాలలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోగయ్యారు. మంచిర్యాల ఐబీ నుంచి మొదలు హైటెక్ సిటీ, డీసీపీ ఆఫీసు వరకు జనం, పోలీసులతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సుమన్‌ను కోర్టులో హాజరు పర్చగా బయట ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బాల్క సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డికి 14 రోజుల రిమాండ్ కోర్టు విధించడంతో వీరిని ఆదిలాబాద్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా సుమన్ పోలీసు వాహనం నుంచి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా, జైలుకు పంపించినా క్యాతనపల్లి మున్సిపాలిటీ వివేక్‌కు దక్కదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వారిని తరలించారు.