2 చరణాల వందేమాతరాన్నే ఆలపిస్తాం
కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రకటన
బెంగళూరు, ఆగస్టు 26: వందేమాతరం పూర్తి గీతం ఆలపించబోమని, ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka CM DK Shivakumar) ప్రకటించారు. గీతంలోని రెండు చరణాలను మాత్రమే పాడతామని చెప్పారు. బుధవారం మీడియా వందేమాతరం పూర్తి గీతం ఆలపణపై ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇకపై తమ రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా గతంలో నిర్ణయించిన విధంగానే తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేశారు.
1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని డీకే సమర్థించారు. భారత్ భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలతో కూడిన దేశమని అన్నారు. ప్రతి వర్గాన్ని గౌరవించడమే కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వందేమాతరం తరువాతి చరణాల్లో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఇతర వర్గాలకు అవి అభ్యంతరకరంగా ఉండొచ్చన్న కారణంతో తొలి రెండు చరణాలకే పరిమితం కావాలని నిర్ణయించింది. కర్ణాటకలోనూ ఇదే నిర్ణయం అమలవుతుందని శివకుమార్ స్పష్టం చేశారు.






