28 March, 2026 | 4:31 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

పాలిటెక్నిక్ కళాశాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

26-03-2026 12:04 AM

ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి 

నిజామాబాద్, మార్చి 25( విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు.

యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో ఉద్దేశ్యంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం నవీపేట కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా, ప్రజలకు వారి అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపరచేందుకు సహకరించాలని కోరారు.

ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నామని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై నిఘా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ పామ్ ఫాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున, అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని,

ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు.