ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
- తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ..
గాంధారి,(విజయక్రాంతి): ప్రభుత్వం ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో తపస్ మండల బాధ్యులు ముద్దసాని స్వామి అధ్యక్షతన మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తపస్ మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పి.ఆర్.సి. , సి.పి.ఎస్. లను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ముప్పై నెలలు గడుస్తున్న పి.ఆర్.సి. ప్రకటించక పోవడం అత్యంత బాధాకరం అన్నారు. ఉద్యోగులు తమ జీవిత కాలంలో 30 నుండి 40 సంవత్సరాల పాటు సేవలందించినప్పటికీ వారికి పదవి విరమణ అనంతరం కనీస పెన్షన్ లేకపోవడం వారి జీవన హక్కులను హరించినట్టే అని ఆయన అభిప్రాయ పడ్డారు.
సి.పి.ఎస్. విధానం ఉద్యోగులకు భద్రతలేని భవిష్యత్తును మిగులుస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం సభ్యులకు రాష్ట్ర బాధ్యులు రంగారావు మాట్లాడుతూ భవిష్యత్తులో సంఘం బలోపేతానికి , ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలని మార్గదర్శనం చేశారు.




