7 July, 2026 | 3:00 AM

38 డిమాండ్లను నెరవేర్చాల్సిందే!

07-07-2026 02:08 AM

పాక్ ప్రభుత్వానికి జేఏసీసీ అల్టిమేటం

హక్కులను పునరుద్ధరించాల్సిందేనని ఉద్ఘాటన

మెడిసిన్, నిత్యావసరాలు అందించాలని డిమాండ్ 

ఫైనల్ యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు

ఇస్లామాబాద్, జూలై ౬: ‘మా ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలి. నిత్యావసరాలు, మెడిసిన్ అందేలా చూడాలి. అరెస్టయిన ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలి. మొత్తం మా ౩౮ డిమాండ్లను నెరవేర్చకుంటే ఈనెల ౯న మా ఫైనల్ యాక్షన్ ఉంటుంది’ అని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) తాజాగా పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.

పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో రోజుకురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. స్థానిక నిరసనలకు మద్దతుగా జేఏఏసీ నిలిచి, హక్కుల సాధన కోసం వారితో కలిసి పోరాడుతున్నది. ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని, పీవోకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

అలాగే, ఇస్లామిక్ కోఢై ఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలు పీవోకేలో పర్యటించాలని విజ్ఞప్తి చేసింది. పాక్ ప్రభుత్వ అరాచకాలను ఆధారాల రూపంలో అంతర్జాతీయ సమాజం ఎదుట పెట్టాలని కోరింది. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు 20 రోజులుగా పీవోకేకు రేషన్, మెడిసిన్ సరఫరా నిలిచాయి. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడి పరిస్థితులు నానాటికీ దిగజారుతుండటంతో తమను ఎల్వోసీ గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు జేఏఏసీ నేత అమన్ కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.